Medaram: ప్రశాంతంగా పూర్తయిన మేడారం మహాజాతర తొలి ఘట్టం
తెలంగాణ కుంభమేళా జనసంద్రమైంది. మేడారం (Medaram) మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు(Pagididdaraju), గోవిందరాజు (Govindaraj) చేరుకోవడంతో జాతర తొలి ఘట్టం పూర్తైంది. కుంకుమ భరిణ రూపంలో సారలమ్మ (Saralamma) గద్దెలపైకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అధికార యంత్రాంగంతో కన్నెపల్లి చేరుకొన్నారు. సారలమ్మను బయటకు తీసుకొచ్చే సమయంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆదివాసీలు నత్యాలు చేస్తూ, కొమ్ము బూర ఊదుతుండగా మంత్రులు, అధికారులు సైతం తన్మయత్వంతో పరవశిస్తూ అమ్మవారికి ఆహ్వానం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకుంటున్నారు. జంపన్నవాగు, మేడారం పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు.






