Bandi Sanjay: స్వాతంత్ర్య వీరుల పెన్షన్ కేసులు త్వరగా పరిష్కరించండి: బండి సంజయ్

స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ కేసులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) సమస్యలను కూడా వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఇప్పటివరకు ఈ ఆస్తుల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాల నుండి అవసరమైన పత్రాలు అందకపోవడమేనని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి (Bandi Sanjay Kumar).. వెంటనే రాష్ట్రాలకు లేఖలు పంపాలని, పత్రాల సేకరణను వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలను పంపాలని ఆదేశించారు.
శత్రు ఆస్తుల విషయంలో వివాదాలను త్వరగా పరిష్కరించాలని, యుద్ధ ప్రాతిపదికన సర్వే, సరిహద్దుల నిర్ధారణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణలోని శత్రు ఆస్తుల పురోగతిపై పూర్తి వివరాలు అందించాలని కోరారు. ఎక్కువ సంఖ్యలో శత్రు ఆస్తులు ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ, ఆయా రాష్ట్రాలకు లేఖలు పంపించి సమావేశాలు నిర్వహించాలని బండి సంజయ్ (Bandi Sanjay Kumar) ఆదేశించారు. వచ్చే నెలలో కార్యాలయాలను సందర్శించి పురోగతిని స్వయంగా సమీక్షిస్తానని ఆయన తెలిపారు.