టాటా సన్స్ చైర్మన్ గా …

1991లో జేఆర్డీ టాటా అనంతరం టాటా సన్స్ చైర్మన్గా రతన్ టాటా పగ్గాలు చేపట్టి.. 2012 డిసెంబరు 28వ తేదీన రిటైరయ్యేదాకా సంస్థను సమర్థంగా నడిపారు. ఆ తర్వాత మళ్లీ 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. 1991లో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 250 దాకా ఉండేది. కానీ, ఆయన వాటిని 98కి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు. టాటా గ్రూపు.. హై టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించేందుకు బీజం వేశారు. టాటా గ్రూప్ ఆయన హయాంలోనే 10 వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలీ సర్వీసెస్ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎ్సను.. దేశంలో వెయ్యికోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. వ్యాపారవేత్తగానే కాదు.. తన ఆదాయంలో 60 నుంచి 65 శాతం మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్తో, 2008లో పద్మవిభూషణ్తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్ టాటా అందుకున్నారు.