Rahul Gandhi: ఓట్ చోరీలో ఈసీ కూడా పార్టనర్..! రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు !!

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ (EC)పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ చోరీ పై (Vote Chori) మరోసారి ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన, చీఫ్ ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను (Gyanesh Kumar) టార్గెట్ గా చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని ఆయన కాపాడుతున్నారని ఆరోపించారు. తన ఆరోపణలకు 100శాతం ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న రాహుల్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లక్షలాది ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని వెల్లడించారు. ఇది ఇంతటితో ఆగిపోలేదని, హైడ్రోజన్ బాంబ్ లాంటి సంచలన విషయాలు ఇంకా ఉన్నాయని ఆయన అన్నారు. అయితే, రాహులా గాంధీ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.
యువతకు ఎన్నికలను ఎలా రిగ్ చేయాలో చూపిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ప్రారంభించారు. కర్ణాటక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తొలగించిన ఓటర్ల జాబితాను ఆయన ప్రదర్శించారు. ఫేక్ అప్లికేషన్లు ఫైల్ చేసి, ఫేక్ లాగిన్ ఐడీలతో ఓటర్ల పేర్లను డిలీట్ చేశారని రాహుల్ అన్నారు. ఇతర రాష్ట్రాల ఫోన్ నంబర్లు ఉపయోగించి కర్ణాటకలో ఓట్లు తొలగించారన్నారు. సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల్లో 14 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ ఫోన్ నంబర్లు ఎవరివి? వాటిని ఎవరు ఆపరేట్ చేశారు? అని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే ఓటర్ల పేర్లును టార్గెట్ చేసి తొలగించారనేది రాహుల్ ఆరోపణ. మైనారిటీలు, ఆదివాసీలు, దళితులు, OBCలు ఓట్లే ఎక్కువగా తొలగించారన్నారు. మహారాష్ట్రలో రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారని, ఇక్కడ కూడా కేవలం కాంగ్రెస్ ఓటర్లే టార్గెట్ అయ్యారని పేర్కొన్నారు. సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ప్లాన్ ప్రకారం ఓట్లు తొలగిస్తున్నారని., కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. అధికారులకు తెలియకుండా ఓట్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఓట్ల తొలగింపు ఐడీలు, OTPలు తమకు ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. కర్ణాటక సీఐడీ 18 నెలల్లో 18 సార్లు ఈసీకి లేఖళు రాసిందని, అయినా స్పందన లేదని రాహుల్ ఆరోపించారు. ఈసీ ఉద్దేశపూర్వకంగా లక్షల ఓటర్ల పేర్లు తొలగించిందని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఓట్ చోర్లను కాపాడుతున్నారని చెప్పారు.
ఆగస్టు 7న నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. మహాదేవపురలో 1,00,250 ఫేక్ ఓట్లు కలిపారని, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానంలో బీజేపీ విజయానికి ఇవి కారణమని చెప్పారు. డూప్లికేట్ EPIC నంబర్లు, ఒకే అడ్రస్‌లో బల్క్ రిజిస్ట్రేషన్లు, ఇన్వాలీడ్ అడ్రస్‌లు ఇందులో ఉన్నాయంటూ ఆధారాలు చూపారు. ఈసీ ఈ ఆరోపణలను తిరస్కరించింది. అఫిడవిట్ సమర్పించాలని, ప్రభావిత ఓటర్ల పేర్లు ఇవ్వాలనిని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ ఆరోపణలు తప్పు, ఆధారరహితం అని వాదించింది. పబ్లిక్ మెంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఓటు డిలీషన్ సాధ్యం కాదని, ప్రభావిత వ్యక్తికి తన వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వాలని పేర్కొంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై ఆరోపణలు ‘బేస్‌లెస్’ అని చెప్పింది. అయితే రాహుల్ ఆరోపణలపై విచారణ జరపాలని, ఆయనపై ఎదురుదాడి చేయడం మానేయాలని మాజీ సీఈసీ ఎస్.వై.ఖురేషీ సూచించారు.
రాహుల్ ఆరోపణలు భారత ప్రజాస్వామ్యానికి సవాలుగా మారాయి. అడిగిన డేటా ఈసీ ఇవ్వకపోతే, అది ఓట్ చోర్లను కాపాడుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా, ఫ్రాడ్ బయటపడకపోతే ఓటమి ఎదురయ్యేదని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా, యూపీ, బీహార్‌లో కూడా మాస్ డిలీషన్లు జరుగుతున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకంలో మార్పులు చేయాలని, ఓటర్ రోల్స్ ఆడిట్ చేయాలని విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు.