Jagan: అసెంబ్లీ సమావేశాలకు ఆ నలుగురు..జగన్ కొత్త వ్యూహం..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. ఈ సమావేశాలపై ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీ (YSRCP) తరఫున 11 మంది ఎమ్మెల్యేల హాజరు అంశం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మాత్రం వీరు సభకు రావాలని సవాళ్లు విసురుతుండగా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) కూడా విజ్ఞప్తులు చేశారు. మొదట భీష్మించి అసెంబ్లీకి దూరంగా ఉంటామని సూచించిన వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సభలో పాల్గొనకపోతే ప్రజల్లో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రభుత్వం దీనిని మరింత హైలైట్ చేసే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా రైతు సమస్యలు, ప్రజా సమస్యలపై బహిరంగంగా పోరాడుతున్న వైసీపీ, వాటిని సభ వేదికగా వినిపించకపోతే ఉపయోగం ఉండదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కీలక నేతల సూచనలతోనే జగన్ కొంత సడలింపు చూపించారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నాలుగురు ఎమ్మెల్యేల్ని అసెంబ్లీలో పాల్గొనడానికి అనుమతించినట్టు తెలుస్తోంది. వారిలో పుంగనూరు (Punganur) ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి (Peddireddy Ramachandra Reddy), బద్వేల్ (Badvel) ఎమ్మెల్యే దాసరి సుధ (Dasari Sudha), అరకు (Araku) ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం (Regam Matsyalingam), మంత్రాలయం (Mantralayam) ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి (Balanagireddy) ఉన్నారు.
ఈ ఎంపికలో ఆసక్తికర అంశం ఏంటంటే, ఈ నలుగురు కూడా ఇటీవల రాజకీయాల్లో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచారు. పెద్దిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవచ్చని ఊహాగానాలు వచ్చాయి. సుధ విషయంలో జనసేన (Jana Sena)లో చేరతారనే వార్తలు చక్కర్లు కొట్టాయి, అయితే ఆమె ఖండించారు. మత్స్యలింగం ఇటీవల దూకుడుగా వ్యవహరిస్తూ తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాలనాగిరెడ్డి అయితే వైసీపీపైనే విమర్శలు గుప్పించి, గెలిచాక ఇంట్లో కూర్చోడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో వారిని సభకు పంపేందుకు అనుమతి ఇవ్వడం చర్చనీయాంశమైంది.
గురువారం జరగబోయే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మరికొంత మందికి కూడా అనుమతి ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సమావేశాలకు జగన్ మాత్రం హాజరుకాబోరని స్పష్టంగా తెలిసింది. ప్రజల్లో వస్తున్న విమర్శలు, ప్రభుత్వ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ తమ వ్యూహంలో కొంత మార్పు చేయాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి మధ్య, వైసీపీ అసెంబ్లీ వేదికలో కనీసం కొంత మేరకు పాల్గొనే నిర్ణయం తీసుకోవడం పార్టీకి వ్యూహాత్మక లాభాలు ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.