AP Tourism: ప్రపంచ పర్యాటక వేదికపై ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రచారం!
అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ పర్యాటక మార్కెట్ (WTM)-2025 ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైభవాన్ని విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది. వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ను లండన్లో ప్రారంభించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఏపీ పర్యాటక (AP Tourism) స్టాల్ను ప్రారంభమైంది. ఈ సందర్భంగా 20కి పైగా అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లు, హోటల్ చైన్ ప్రతినిధులు, ఎంఐసీఈ (MICE) పెట్టుబడిదారులు, గ్లోబల్ ట్రావెల్ మీడియా, ప్రముఖ బ్లాగర్లతో పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర టూరిజం (AP Tourism) పాలసీ 2024-29 ముఖ్యాంశాలను, పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు.
ఏపీలోని (Andhra Pradesh) అద్భుతమైన తీర ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, వారసత్వ సంపద, సాంస్కృతిక కళారూపాలను ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పర్యాటకాన్ని (AP Tourism) ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టి, తద్వారా ఉపాధి, అభివృద్ధి అవకాశాలను కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.







