Rahul Gandhi: బిహార్ ఎన్నికలను కూడా హైజాక్ చేసే కుట్ర.. బీజేపీపై రాహుల్ విమర్శలు

బిహార్ ఎన్నికలను (Bihar Elections) మహారాష్ట్ర తరహాలో హైజాక్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని, ఇందుకోసం ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేశారు. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై దాడి చేస్తోందని విమర్శించారు. మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య కోటి మంది కొత్త ఓటర్లు అకస్మాత్తుగా ఎలా వచ్చారో ఎవరికీ తెలియదని, ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తమకు సమాధానం ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ వీడియోగ్రఫీని అందించాలని పదేపదే కోరినా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. బిహార్‌లో (Bihar Elections) కూడా ఇలాంటి పరిస్థితులే పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అవకతవకలకు బీజేపీ, ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. అలాగే ఒడిశా ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించిన ఆయన.. బీజేపీ ప్రభుత్వం పేదల డబ్బును దోచుకుంటోందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు.