Bihar Elections: సీట్ల పంపకంలో సమస్యలు.. లాలూకు రాహుల్ ఫోన్!

బిహార్‌లో తొలి దశ ఎన్నికలకు (Bihar Elections) నామినేషన్లు వేసే గడువు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ (ఇండియా కూటమి)లో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఎలాగైనా సీట్ల లెక్కలు తీర్చేందుకు కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి చర్చలు జరిపినట్లు సమాచారం. ఎన్డీయే కూటమి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. విపక్ష కూటమిలో ఇంకా సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య సీట్ల కేటాయింపు ప్రధాన సమస్యగా ఉంది.
కాంగ్రెస్‌కు (Congress) దాదాపు 50 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ (RJD) సిద్ధంగా ఉండగా, ఆ పార్టీ మాత్రం కనీసం 60 సీట్లు అడుగుతోందని తెలుస్తోంది. ఆర్జేడీ తమకు పట్టున్న స్థానాలను వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో రాష్ట్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు మధ్య చర్చలు విఫలమయ్యాయి. అందుకే పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు నేరుగా లాలూతో చర్చలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.