PM Modi: ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశే .. అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోడీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Polls) దగ్గర పడుతున్న వేళ ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ విపక్ష కూటమి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో తన తొలి ర్యాలీలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ఈ ప్రశ్నకు బదులిచ్చారు. ఎన్డీయే (NDA) కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని అధికారికంగా ప్రకటించారు. ఒక సీఎం అభ్యర్థిగా నితీశ్‌ను మోడీ నేరుగా ప్రతిపాదించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
నితీశ్ (Nitish Kumar) నాయకత్వంలో ఎన్డీయే కూటమి గత ఎన్నికల రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని, భారీ విజయం సాధిస్తుందని మోడీ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జేడీ (RJD) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. నితీశ్ 2005లో అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన పాలనలోని తొలి పదేళ్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండటంతో ఏమీ చేయలేకపోయారన్నారు.







