President Murmu: శబరిమల ఆలయంలో ప్రెసిడెంట్ ముర్ము పూజలు

కేరళలోని ప్రసిద్ధ శబరిమల (Sabarimala) ఆలయంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (President Murmu) పూజలు చేశారు. దీంతో ఆలయాన్ని సందర్శించిన తొలి మహిళా ప్రెసిడెంట్ ఆమె చరిత్ర సృష్టించారు. అయితే ఇలా శబరిమల ఆలయాన్ని దర్శించిన రెండో రాష్ట్రపతి ముర్ము కావడం గమనార్హం. 1970లో అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. ప్రెసిడెంట్ ముర్ముకు (President Murmu) ఆలయ సన్నిధానం వద్ద ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనరావు ఘనస్వాగతం పలికారు. మహిళల ఆలయ ప్రవేశంపై నిషేధాన్ని 2018లో సుప్రీంకోర్టు ఎత్తివేసిన నేపథ్యంలో, రాష్ట్రపతి పర్యటన కీలకమైంది.
అయితే తొలిసారి కేరళ చేరుకున్న ప్రెసిడెంట్ ముర్ముకు (President Murmu) స్వల్ప ఇబ్బంది ఎదురైంది. పతనంతిట్టలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆమె వచ్చిన హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే, హెలిపాడ్‌పై ఉన్న గుంతలో పడి ఒక పక్కకు ఒరిగింది. వాతావరణం బాగలేని కారణంగా చివరి నిమిషంలో ల్యాండింగ్ పాయింట్‌ను మార్చడంతో.. హుటాహుటిన ఆ హెలిపాడ్‌ను నిర్మించారు. దీంతో అది పూర్తిగా గట్టిపడని ల్యాండింగ్ ప్యాడ్.. హెలికాప్టర్ బరువుకు కుంగినట్లు సమాచారం. ఇది జరగడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది హెలికాప్టర్‌ను సురక్షితంగా బయటకు తీశారు.