Draupadi Murmu: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) తో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో భేటీ అయ్యారు. బీహార్ (Bihar) అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్) పై చర్చకు పట్టుబడుతూ పార్లమెంట్ సమవేశాలను విపక్షాలు అడ్డుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రపతి తో మోదీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. జూలై 21న ప్రారంభమైన పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై సుదీర్ఘమైన చర్చ తప్ప మరే ఇతర కార్యకలాపాలు ఇప్పటివరకు జరగలేదు. రష్యా నుంచి మిలటరీ సామాగ్రి, చమురును కొంటున్న కారణంగా భారత్ ఎగుమతులపై 25 శాతం సుంకాలను, పెనాల్టీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజల తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రుల మధ్య సమావేశం చోటు చేసుకోవడం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కూడా భేటీ అయ్యారు. వీరి వరుస భేటీల వెనక కారణాలు తెలియనప్పటికీ గంటల వ్యవధిలోనే ఇరువురు కీలక నేతలు రాష్ట్రపతితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.