PM Modi: ఏటా 50 రాకెట్లు ప్రయోగించే స్థాయికి చేరాలి.. ఇస్రో సైంటిస్టులతో ప్రధాని మోడీ

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అంతరిక్ష రంగంలో భారతదేశం సాధిస్తున్న విజయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో విజయం భారత్‌కు అలవాటుగా మారిందని ఆయన అన్నారు. రెండు సంవత్సరాల క్రితం చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపుతామని, అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ‘వికసిత్ భారత్’ కీర్తిని చాటుతామని మోడీ (PM Modi) పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో సంవత్సరానికి 50 రాకెట్లను ప్రయోగించే స్థాయికి మనం చేరుకోగలమా అని శాస్త్రవేత్తలను ప్రశ్నించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలని వారికి పిలుపునిచ్చారు.
మానవాళి భవిష్యత్తును ప్రకాశవంతం చేసే రహస్యాలను ఛేదించడానికి మరింత లోతైన అంతరిక్ష పరిశోధనలకు సిద్ధం కావాలని భారత శాస్త్రవేత్తలకు ప్రధాని (PM Modi) పిలుపునిచ్చారు. యువత కూడా ఈ యాత్రలో భాగం కావాలని కోరారు. విశ్వం మనకు ఏదీ చివరి సరిహద్దు కాదని తెలియజేస్తుందని, అదేవిధంగా భారత్ అంతరిక్ష రంగంలో ఎటువంటి హద్దులు లేకుండా ముందుకు సాగాలని ఆయన (PM Modi) ఆకాంక్షించారు. శాస్త్రవేత్తల నిరంతర కృషి వల్ల త్వరలో గగన్‌యాన్ మిషన్ ప్రారంభమవుతోందని, మరికొన్నేళ్లలోనే సొంత అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) కూడా ఏర్పాటుచేసుకుంటామని మోడీ తెలిపారు. ఈ రంగం అభివృద్ధిలో ప్రైవేట్ రంగం కూడా భాగం కావాలని ఆయన (PM Modi) కోరారు.