PM Modi: దేశ ప్రయోజనాల విషయంలో రాజీ లేదు: ప్రధాని మోడీ
డోనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) పరోక్షంగా స్పందించారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఎం.ఎస్.స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాలను ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదని మోడీ (PM Modi) తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా తాను ఎలాంటి కష్టాలనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నానని, దేశ ప్రయోజనాల కోసం భారీ మూల్యం చెల్లించడానికైనా వెనుకాడనని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ను గౌరవిస్తూ, ఆయన పేరుతో ఒక స్మారక నాణెం, స్టాంపును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామినాథన్ కృషిని మోడీ (PM Modi) కొనియాడారు. “బయో-హ్యాపీనెస్” అనే ఆయన భావనను ప్రస్తావిస్తూ, జీవవైవిధ్యంతో స్థానిక ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని స్వామినాథన్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరువులు, తుపానుల సందర్భంలో స్వామినాథన్ అందించిన సలహాలను ఆయన (PM Modi) గుర్తు చేసుకున్నారు.






