IndiGo: ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టు లో పిల్..
ప్రత్యక్షనరకం అంటే ఏమిటో విమానాశ్రయాల్లోపడిగాపులు పడుతున్నప్రయాణికులకు అర్థమవుతోంది. ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా వెయ్యికి పైగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో.. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. తాము వెళ్లే విమానం పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ప్రత్యామ్నాయం ఎలా.. అన్నది అర్థం కాక కిందమీద పడుతున్నారు. ఇక లింక్డ్ విమాన ప్రయాణం పెట్టుకున్న వారి పరిస్థితి మరీఘోరం.. వారికి అక్కడ ఆ విమానం అందదు.. ఇక్కడ విమానం ఎగురదు. దీంతో విమానాశ్రయాల్లో కాందిశీకుల్లా మారింది వీరి పరిస్థితి.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం వల్ల ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు (IndiGo Crisis). ఇప్పుడు ఈ సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. విమాన సర్వీసుల రద్దుపై అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను సుప్రీం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత ఐదు రోజులుగా ఇండిగో విమానాల్లో అంతరాయం కొనసాగుతోంది. పలు ఎయిర్‌పోర్టుల్లో దాదాపు 1000కు పైగా దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రకటన విడుదల చేసింది. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, అయితే కొన్ని సరీసులపై ప్రభావం కొనసాగుతోందని వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే కూడా రంగంలోకి దిగింది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది.
పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడమే తమ తక్షణ కర్తవ్యమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు, షెడ్యూలింగ్ నెట్‌వర్క్‌ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ, ఎలా తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటుచేశామని, పిల్లలు, వృద్ధులు, పాలిచ్చే తల్లులు, వికలాంగులకు విమానయానంలో ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని ఎయిర్పోర్ట్, ఎయిర్‌లైన్ ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.






