Rajnath Singh: పాకిస్థాన్ ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే.. రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

పాకిస్థాన్‌కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణుల పరిధిలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. లక్నోలోని ఏరోస్పేస్ ఫెసిలిటీలో స్వదేశీయంగా తయారుచేసిన బ్రహ్మోస్ మిస్సైల్స్ మొదటి బ్యాచ్‌ను ప్రారంభించిన అనంతరం రాజ్‌నాథ్ (Rajnath Singh) ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో భారత్ శక్తి ప్రపంచానికి తెలిసొచ్చింది. దేశ భద్రతకు బ్రహ్మోస్ ఎంతో ఉపయోగపడుతుందని నిరూపితమైంది. శత్రువులు తమ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉందని గ్రహించారు. కానీ అప్పుడు జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే. ఆ ట్రైలర్‌తోనే భారత్ సత్తా ఏంటో వారికి అర్థమైంది” అని రాజ్‌నాథ్ (Rajnath Singh) తెలిపారు.
బ్రహ్మోస్ క్షిపణి భారత సాయుధ దళాలకు వెన్నముకగా మారిందని, దేశ విశ్వాసాన్ని ఇది బలోపేతం చేసిందని ఆయన కొనియాడారు. ప్రత్యర్థులు ఇకపై బ్రహ్మోస్ నుండి తప్పించుకోలేరని దేశం నమ్ముతోందన్నారు. బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదని, భారతదేశంలో పెరుగుతున్న స్వదేశీ సామర్థ్యాలకు చిహ్నం అని, దాని వేగం, ఖచ్చితత్వం, శక్తి దాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ క్షిపణులలో ఒకటిగా నిలుపుతాయని రాజ్‌నాథ్ (Rajnath Singh) తెలిపారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని చేరుకోవడంలో రక్షణ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.