Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ నిషేధిత బిల్లుకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

డబ్బుతో కూడిన ఆన్‌లైన్ గేమింగ్‌ను (Online Gaming Bill) నిషేధించే ముఖ్యమైన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025’ పేరిట కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మనీలాండరింగ్, ఆర్థిక మోసాలు, బెట్టింగ్ యాప్‌లకు బానిసలు కావడం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ఆన్‌లైన్ గేమ్‌లు, ఈ-స్పోర్ట్స్ మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలుశిక్ష లేదా కోటి రూపాయల జరిమానా విధించవచ్చు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు (Online Gaming Bill) ప్రకారం, అడ్వర్టయిజ్‌మెంట్లలో పాల్గొన్న వారికి రెండేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో భాగస్వాములైన వారికి గరిష్టంగా మూడేళ్ల శిక్ష, కోటి రూపాయల జరిమానా ఉంటుంది. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేవారిని నేరస్థులుగా కాకుండా, బాధితులుగా ఈ (Online Gaming Bill) బిల్లు పరిగణిస్తుంది. అయితే, ఈ బిల్లు తమ పరిశ్రమకు నష్టం కలిగిస్తుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నిషేధానికి బదులుగా నియంత్రణ ఉండాలని సూచించింది.