Omar Abdullah: పహల్గాంపై నిష్పక్షపాత విచారణ కోరిన పాక్ పీఎం.. మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) చేసిన ప్రకటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మండిపడ్డారు. ఆ దారుణమైన ఘటనను తొలుత పాకిస్థాన్ ఖండించలేదని చెప్పిన ఆయన.. ఈ విషయంలో పైగా భారతదేశంపైనే నిందలు మోపిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. “పహల్గాంలో జరిగిన దుర్ఘటనను కనీసం వారు గుర్తించలేదు. ఆ దుర్ఘటన వెనుక భారతదేశం ఉందని మొదట ఆరోపించారు. మనపై నిందలు వేయడంలో ముందుండే వారికి ఇప్పుడు ఏం చెప్పినా వృథా. వారి ప్రకటనలకు అసలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే లేదు. దురదృష్టకరమైన ఈ ఘటన అసలు జరిగి ఉండాల్సింది కాదు” అని ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) తేల్చిచెప్పారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif).. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. “పహల్గాంలో దురదృష్టకరమైన సంఘటనతో మన దేశం మరొకసారి నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నమ్మదగిన విచారణ జరిగితే మద్దతు తెలపడానికి మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యత” అని షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని షరీఫ్ ప్రకటించారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) తీవ్ర విమర్శలు చేశారు.