Rahul Gandhi: ఒడిశా విద్యార్థినిని చంపింది బీజేపీ వ్యవస్థే: రాహుల్ గాంధీ

ఒడిశాలో లైంగిక వేధింపులు భరించలేక ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. ఈ ఆత్మహత్యకు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. “ఇది బీజేపీ వ్యవస్థ చేసిన హత్య. కాషాయ పార్టీ నిందితులను కాపాడుతోంది” అని రాహుల్ విమర్శించారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడిన ఆ విద్యార్థినికి న్యాయం జరగకపోగా, ఆమెను బెదిరించి, హింసించి, అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. “మోడీ జీ.. ఒడిశాలో, మణిపూర్‌లో ఈ దేశ కుమార్తెలు కాలిపోతున్నారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మీరెందుకు మౌనంగా ఉన్నారు? దేశానికి మీ నిశ్శబ్దం కాదు, సమాధానాలు కావాలి” అని రాహుల్ (Rahul Gandhi) డిమాండ్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ “చిల్లర రాజకీయాలు” చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషాద ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. “ఒడిశాలో జరిగిన సంఘటన దేశం మొత్తాన్ని కుదిపివేసింది. కానీ కాంగ్రెస్ (Congress) తన రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని అవకాశంగా వాడుకుంటోంది” అని ప్రధాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.