అలాంటి ప్రతిపాదనేదీ లేదు .. గడ్కరీ క్లారిటీ
డీజిల్ వాహనాలపై అదనంగా పొల్యూషన్ ట్యాక్స్ వేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. అయితే సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం దిశగా స్వచ్ఛ ఇంధనాలను ప్రోత్సహించాల్సిన అవసరం మాత్రం ఉందని తెలిపారు. డీజిల్ వాహనాల విక్రయాలను నిరుత్సాపరచాలనే ఉద్దేశంతో వాటి అమ్మకాలపై 10 శాతం అదనంగా జీఎస్టీ విధించాలని కేంద్రం ప్రతిపాదించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గడ్కరీ స్పందించి అలాంటి ఆలోచనైతే ప్రస్తుతానికి లేదని తేల్చి చెప్పారు. సియాన్ వార్షిక సదస్సులో పాల్గొన్న గడ్కరీ డీజిల్ వాహనాల ఉత్పత్తి తగ్గించాలని ఆటోమొబైల్ను పరిశ్రమను కోరారు. దేశంలో ఇప్పటికే డీజిల్ కార్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, తయారీ సంస్థలు వాటిని ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.






