National Herald: సోనియా, రాహుల్‌కు నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ

నేషనల్ హెరాల్డ్ (National Herald)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi) , రాహుల్ గాంధీ (Rahul Gandhi )లకు నోటీసులు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢల్లీి కోర్టును ఆశ్రయించింది. కాగా న్యాయస్థానం దీనికి నిరాకరించింది. కొత్త చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జీషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేమని, కాబట్టి విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ (ED) కోరింది. ఈ విషయంలో తాము ఏమీ దాచట్లేదని, ఈ కేసు విచారణకు ముందు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి గాంధీ కుటుంబానికి అవకాశమిస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు.
నోటీసులు ఇచ్చే ముందు, ఏదైనా ఆర్డర్‌ను జారీ చేసేముందు అందులో ఏదైనా లోపం ఉందా అనే విషయాన్ని న్యాయస్థానం పరీక్షించాల్సి ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే (Justice Vishal Gogne) అన్నారు. ఛార్జీషీట్‌లో సరైన పత్రాలు లేవని, ఆ పత్రాలను దాఖలు చేయాలని ఈడీ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. వాటిని పరీక్షించిన అనంతరం నోటీసులు జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కేసు విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.