Mohan Bhagwat: శత్రువులను భారత్ వదిలిపెట్టదు: మోహన్ భాగవత్

భారతదేశం తన పొరుగు దేశాలకు ఎప్పటికీ హాని తలపెట్టదని, అయితే ఎవరైనా శత్రువులు అపాయం తలపెడితే వారిని విడిచిపెట్టడం కూడా జరగదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్ (Mohan Bhagwat) హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “కొన్ని సందర్భాల్లో దురాక్రమణదారుల చేతిలో పరాజయం పాలవ్వకుండా ఉండటం కూడా మన విధి. ఇది సనాతన హిందూ ధర్మంలోని ఒక ముఖ్యమైన నిమమం. హిందూ మతంలోని ఆచరణలు చాలా సులభంగా ఉంటాయి. దీనిలోని అహింసా సూత్రాలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. ఈ సూత్రాలు నచ్చి ఎంతోమంది హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. అయితే కొందరు మాత్రం వీటిని అంగీకరించక ఇబ్బందులు కలిగిస్తారు. అటువంటి పరిస్థితుల్లో వారి నుంచి మనల్ని మనం సమర్థవంతంగా రక్షించుకోవడం కూడా మన బాధ్యతే. ప్రజల భద్రత కోసం రాజు తన కర్తవ్యాన్ని తప్పక నిర్వర్తిస్తాడు” అని మోహన్ భగవత్ అన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోహన్ భగవత్ (Mohan Bhagwat) చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.