UNESCO: భారత్‌లోని 12 కోటల సముదాయానికి యునెస్కో గుర్తింపు.. అమిత్ షా హర్షం
పారిస్‌లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో భారత దేశానికి శుభవార్త అందింది. మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణమైన కోటల వ్యవస్థకు యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. ఈ ప్రత్యేకమైన సైనిక వ్యవస్థను సూచించే ‘మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్’ను (Maratha Military Landscape) ప్రపంచ హెరిటేజ్ జాబితాలో చేర్చినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో భారతదేశం నుంచి యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాల సంఖ్య 44కు చేరింది. 2024-25 యునెస్కో సైకిల్ కోసం కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, తమిళనాడులలో విస్తరించి ఉన్న 12 మరాఠా కోటల (Maratha Forts) సముదాయాన్ని నామినేట్ చేసింది. ఈ ‘మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్’లో మహారాష్ట్రలోని సల్హేర్, శివనేరి, లోహ్‌గఢ్, ఖండేరి, రాజీగఢ్, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా, విజయ్ దుర్గ్, సింధుదుర్గ్ కోటలు, అలాగే తమిళనాడులోని జింజీ కోట ఉన్నాయి.
ఈ కోటలు విభిన్న భౌగోళిక, భౌతిక ప్రాంతాలలో విస్తరించి ఉన్నప్పటికీ, మరాఠా పాలన యొక్క అద్భుతమైన వ్యూహాత్మక శక్తిని ప్రతిబింబిస్తాయని భారతీయ అధికారులు వెల్లడించారు. 17 నుండి 19వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ మిలిటరీ ల్యాండ్స్కేప్స్కు (Maratha Military Landscape) యునెస్కో గుర్తింపు లభించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హర్షం వ్యక్తం చేశారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో ముడిపడి ఉన్న 12 కోటలను యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం దేశవాసులందరికీ ఎంతో గర్వకారణం” అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.






