Mallikarjun Kharge: ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అక్రమాలు: మల్లికార్జున ఖర్గే

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా బీహార్‌లో ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను అక్రమంగా తొలగించారని ఆయన ఆరోపించారు. బతికి ఉన్న వారిని చనిపోయినట్లుగా చూపించి ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఖర్గే విమర్శించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం (ఈసీ) కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయిందని, అయితే సుప్రీంకోర్టు (Supreme Court) ఓటర్ల జాబితాను బహిరంగంగా ఉంచాలని ఆదేశించడం స్వాగతించదగిన విషయమని ఖర్గే అన్నారు. బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్లను తొలగించినా బీజేపీ (BJP) ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. దీని ద్వారా ఎవరికి లాభమో స్పష్టమవుతోందని ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు. అంతేకాకుండా, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఖర్గే మండిపడ్డారు. ప్రతిపక్షాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన విమర్శించారు. మన రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు ఇచ్చిందని ఖర్గే (Mallikarjun Kharge) గుర్తుచేశారు.