Rahul Gandhi: మహారాష్ట్ర తరహాలో బీహార్‌లోను అదే కుట్ర : రాహుల్ గాంధీ

బిహార్‌లో ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మహారాష్ట్ర (Maharashtra) తరహాలో నీతీశ్‌కుమార్ (Nitish Kumar) పార్టీ తమకు అనుకూలమై న వారి ఓట్లు మాత్రమే జాబితాలో ఉండేలా మార్పులు చేస్తోందని విమర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( ఎస్‌ఐఆర్) ను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన బిహార్ (Bihar) బంద్‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభకు, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ముందుగా ఇండియా కూటమికి మెజారిటీ ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిరచాయని రాహుల్ పేర్కొన్నారు. కానీ అనుకోనివిధంగా తాము ఆయా ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. అనంతరం ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ఎన్నికలకు వారం రోజుల ముందు దాదాపు కోటి మంది కొత్త ఓటర్లను చేర్చినట్లు గుర్తించామన్నారు. అలా కొత్త ఓటర్లను చేర్చిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందిందని ఆరోపించారు. బిహార్‌లోనూ అదే కుట్ర పన్నుతున్నారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తాము ఓటర్ల జాబితా అడిగినప్పటికీ ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటివరకు దానిని తమకు అందించలేదని రాహుల్ ఆరోపించారు. రాజ్యాంగ విలువలను రక్షించాల్సిన ఎన్నికల కమిషన్ తన బాధ్యతలు మరిచి బీజేపీ సూచనల మేరకు పని చేస్తోందని విమర్శలు గుప్పించారు.