PM Modi: ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీరాముడే స్ఫూర్తి: ప్రధాని మోడీ

‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. ఈ మేరకు దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన బహిరంగ లేఖలో ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి అని చెప్పిన ఆయన.. ధర్మాన్ని రక్షించడంలో శ్రీరాముని స్ఫూర్తిని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావిస్తూ, ఇది భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడంలో శ్రీరాముని బోధనలకు నిదర్శనమని ప్రధాని (PM Modi) అన్నారు. హింసను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజ్యాంగంపై విశ్వాసం ఉంచిన మావోయిస్టులను కూడా ప్రధాని తన లేఖలో ప్రస్తావించారు. అనేక మారుమూల జిల్లాల్లో వెలిగిన దీపావళి దీపాలు దేశానికి గొప్ప విజయమని కొనియాడారు.
ఇటీవల చేసిన జీఎస్టీ సవరణల వల్ల ప్రజలకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుందని కూడా మోడీ (PM Modi) తెలిపారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, అన్ని భాషలను గౌరవించడం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అంతేకాక, ఆహారంలో నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించి యోగాను ఆచరించడం ద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యం వైపు పయనించవచ్చని ఆయన (PM Modi) ఆకాంక్షించారు.