CJI BR Gavai: సీజేఐపై బూటు విసిరిన లాయర్.. మోడీ ఆగ్రహం

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో (Supreme Court) అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్‌పైకి ఓ న్యాయవాది తన షూ విసిరే ప్రయత్నం చేశాడు. వాదనలు జరుగుతుండగా కోర్టు హాల్‌లో ఉన్న ఆ న్యాయవాది ఆకస్మాత్తుగా సీజేఐపై (CJI BR Gavai) బూటు విసిరేశాడు. అది మరో జడ్జికి సమీపంలో గోడను బలంగా తాకింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఇది చూసి అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, ఆ న్యాయవాదిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI BR Gavai) తక్షణమే స్పందించారు. “ఇవేం పట్టించుకోకుండా వాదనలు వినిపించండి. ఇలాంటివి నాపై ప్రభావం చూపించవు” అన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థపై చర్చకు దారితీసింది. సదరు న్యాయవాదిని రాకేష్ కిశోర్‌గా (Rakesh Kishore) గుర్తించారు. అతను దేశంలో మరెక్కడా ప్రాక్టీస్ చేయకుండా అతని లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు బార్ కౌన్సిల్ ప్రకటించింది. అతనికి షోకాజ్ నోటీసులు కూడా పంపింది.
ఖండించిన మోడీ..
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ (PM Modi)..ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలన్నారు. ఈ తరహా నీచమైన ప్రవర్తనకు సమాజంలో తావులేదన్నారు. తాను ఈ ఘటన గురించి సీజేఐతో (CJI BR Gavai) మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు.