Modi: 51 వేలమందికి ఉద్యోగాలు.. యువతే భవిష్యత్ శక్తి అన్న ప్రధాని మోడీ

భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు యువతే అసలైన మూలధనం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. శనివారం జరిగిన 16వ రోజ్‌గార్ మేళా (Rozgar Mela) కార్యక్రమంలో 51,000 మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన యువతనుద్దేశించి ప్రసంగించారు. “భారత్‌లో జనాభా, ప్రజాస్వామ్యం అనే రెండు అపారమైన శక్తులు ఉన్నాయని ప్రపంచం అంగీకరిస్తోంది. అంటే అతిపెద్ద యువ జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం. యువశక్తి మన దేశానికి మూలధనం. ఈ మూలధనాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది” అని ప్రధాని (PM Narendra Modi) అన్నారు. ఇటీవల ఐదు దేశాలతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలు యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని, ముఖ్యంగా తయారీ మరియు సేవా రంగాలకు తోడ్పడతాయని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని మోడీ తెలిపారు. దేశంలో అసమానతలు వేగంగా తగ్గుతున్నాయని, గొప్ప సమానత్వం వైపు పురోగమిస్తున్నామని ఆయన (PM Narendra Modi) పేర్కొన్నారు.