Jamili elections: జమిలి ఎన్నికలపై వెంకయ్య స్పష్టత..

మాజీ ఉపరాష్ట్రపతి (Vice President) , బీజేపీ (BJP) నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు(Muppavarapu Venkaiah Naidu) తనదైన శైలిలో మరోసారి రాజకీయాలపై స్పందించారు. ఆయన ప్రసంగాల్లో ఉండే హాస్యం, సెటైర్లు ప్రత్యేకంగా గుర్తించదగ్గవే. ఇటీవలి తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడ మాట్లాడుతూ తన అనుభవాలతో పాటు ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, అధికారం పోయిందని కొందరు ఉద్విగ్నతకు లోనవుతున్నారని, అధికారం శాశ్వతమని అనుకోవడం పొరపాటేనని చెప్పారు. ప్రజల తీర్పు ఎప్పటికీ ఊహించలేనిది కాబట్టి, ఎవరూ గర్వంతో నిండిపోవద్దని హితవు పలికారు. గతంలో తనకు కూడా ఆశ్చర్యంగా అనిపించిన ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయనీ, ప్రజలు ఎప్పుడు ఎలా మారతారో చెప్పలేమన్నారు.
సేవ చేసే మనసుతో ముందుకు వెళితే విజయం తప్పదని పేర్కొన్న వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉదాహరణగా చూపారు. ఉచితాల పేరుతో ప్రజలను మోసగించడం వల్ల స్వల్పకాలిక లాభాలు ఉన్నా, దీర్ఘకాలంలో ఫలితం ఉండదని సూచించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ(YCP) పార్టీ పై పరోక్షంగా చేసిన విమర్శలు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే..మరి ఇప్పుడు ఉన్న కూటమి మాట ఏమిటో అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇక జమిలి ఎన్నికలపై (Jamili elections) కూడా వెంకయ్యనాయుడు స్పందించారు. ఒకేసారి రాష్ట్రాలు, దేశానికి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు. ఖజానాపై భారం తగ్గుతుందని, పరిపాలన కూడా సమర్థంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల సమయం, ప్రభుత్వ ఖర్చు రెండూ ఆదా అవుతాయని స్పష్టం చేశారు.
జమిలి ఎన్నికలను వ్యతిరేకించేవారు అనవసర భయాలు పెంచుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నష్టమూ జమిలి ఎన్నికల వల్ల జరగదని ఆయన నొక్కి చెప్పారు. ప్రజలందరికీ ఇది అనుకూలంగా ఉండే మార్గమని వివరించారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్లాలి కానీ అధికారం మోజులోకి వెళ్లడం కాదు అనే సందేశాన్ని తన తేటతెల్ల మాటలతో వెంకయ్యనాయుడు ఇచ్చారు. ఆయన మాటల్లో ఉండే ప్రాస, వ్యంగ్యం ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఆలోచింపజేసేలా ఉన్నాయి.