ISRO: ఇస్రో బాహుబలి.. సూపర్ సక్సెస్..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) .. మరో అరుదైన ఘనత సాధించింది. ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను LVM3-M5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగం విజయవంతమైంది. చారిత్రాత్మక చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతం చేసిన LVM3 రాకెట్ సిరీస్‌లోనే ఈ ప్రయోగం నిర్వహించారు.
CMS-03 ఉపగ్రహం బరువు సుమారు 4400 కిలోలు. భారత భూభాగం నుంచి జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి (GTO) ప్రయోగించిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహమిది. ఈ మల్టీ-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం ద్వారా భారతదేశంతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతాలలో కమ్యూనికేషన్ సేవలను మరింత మెరుగుపరచనున్నారు. ఈ ప్రయోగం దేశీయ టెలికమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ రంగాలకు గొప్ప ఊతాన్ని ఇవ్వనుంది.
ఈ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. రాకెట్, ఉపగ్రహం అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్ 26నే దానిని ప్రయోగ వేదికపైకి తరలించారు. ప్రయోగానికి ముందు అన్ని దశల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి, నిర్దేశిత సమయంలో రాకెట్‌ను నింగిలోకి పంపారు. చంద్రయాన్-3 తర్వాత LVM3 రాకెట్ మరోసారి తన సత్తాను నిరూపించుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.







