ఐపీఎల్ 2024 ఫైనల్ విజేత ఎవరో…? సన్ రైజర్సా..? కోల్ కతా నైట్ రైడర్సా..?

ఇండియన్ ప్రిమియర్ లీగ్ 17వ సీజన్‌లో అంతిమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. లీగ్ దశను తొలి రెండు స్థానాలతో ముగించిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. చెన్నైలో కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. 2012, 2014లో టైటిల్ సాధించిన కోల్‌కతా మూడో కప్పు కోసం ఉవ్విళ్లూరుతుండగా.. 2016లో తొలిసారి ఛాంపియన్ అయ్యాక మళ్లీ కప్పు గెలవని సన్‌రైజర్స్ ఈసారి అవకాశాన్ని వదులుకోకూడదనుకుంటోంది. బలాబలాల్లో సమవుజ్జీల్లా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య చెపాక్‌లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది…
దూకుడు × నిలకడ
విధ్వంసకర బ్యాటింగ్ తో కూడిన సన్‌రైజర్స్‌దే కోల్ కతా పై కొంత పైచేయిగా కనిపిస్తోంది. పైగా చివరగా క్వాలిఫయర్-2 మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడి రాజస్థాన్‌ను ఓడించడం సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఈ సీజన్ ఆరంభం నుంచి హైదరాబాద్ దూకుడుకు మారుపేరుగా ఉంటోంది. హెడ్, అభిషేక్, క్లాసెన్ త్రయం ప్రత్యర్థులను బెంబేలెత్తించేసింది.
చివరి దశలో హైదరాబాద్ దూకుడు తగ్గినా.. బ్యాటింగ్ మాత్రం బలంగానే కనిపిస్తోంది. రాహుల్ త్రిపాఠి గత కొన్ని మ్యాచ్‌ల్లో అదిరే ప్రదర్శన చేయడం సానుకూలాంశం. అయితే మార్‌క్రమ్ ప్రస్తుతానికి ఫామ్‌లో లేడు. సమద్, షాబాజ్‌ల ప్రదర్శనా అంతంతమాత్రమే కావడంతో మిడిలార్డర్ బలహీనంగా మారింది. ఓపెనర్లు విఫలమైతే క్లాసెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. హెడ్, అభిషేక్ ఎంత ప్రమాదకరమో తెలుసు కాబట్టి వాళ్లిద్దరినీ వీలైనంత త్వరగా ఔట్ చేయడానికి కోల్‌కతా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. క్వాలిఫయర్-2లో చెపాక్ పిచ్‌ను చక్కగా ఉపయోగించుకున్న షాబాజ్, అభిషేక్ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నారు.
కోల్‌కతాకు హైదరాబాద్‌తో పోలిస్తే బలమైన బౌలింగ్ విభాగం ఉంది. పేసర్లు స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఎంత ప్రమాదకరమో చెప్పాల్పిన పని లేదు. నరైన్ బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. సాల్ట్ దూరం కావడంతో బ్యాటింగ్ కొంత బలహీనపడినా.. నరైన్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్, రసెల్, రింకులతో బ్యాటింగ్ ఆర్డర్‌తో ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. సీజన్లో ఎంతో నిలకడగా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన జట్టయిన కోల్‌కతాను హైదరాబాద్ ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.