Ambati Rambabu: చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న ఏపీ..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘మాటల యుద్ధం’ మరోసారి హద్దులు దాటింది. గతంలో పట్టాభిరామ్ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో, ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అంతకంటే ఎక్కువ ఉద్రిక్తతకు దారితీశాయి. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అంబటి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వ్యక్తిగత విమర్శల చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ, తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాగరికతను దాటాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనల్లో భాగంగా, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి చేసిన అనుచిత పదజాలం రాష్ట్రవ్యాప్తంగా చిచ్చు పెట్టింది.
తిరుమల లడ్డూ కల్తీ అంశంపై గత కొద్దిరోజులుగా కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. దీనిపై నిరసన తెలియజేస్తున్న క్రమంలో అంబటి రాంబాబు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఉద్దేశించి అసభ్యకరమైన, కించపరిచే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది కేవలం రాజకీయ విమర్శగా కాకుండా, వ్యక్తిత్వ హననంలా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.
అంబటి వ్యాఖ్యలు వెలువడిన గంటల వ్యవధిలోనే టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ముఖ్యంగా గుంటూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించారు. ఇంటిపై రాళ్లు రువ్వడం, ఫర్నిచర్ ధ్వంసం చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏ క్షణమైనా అంబటిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.
గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ నేత పట్టాభిరామ్ అప్పటి ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన “బోస్డికే” వ్యాఖ్యలు ఏ స్థాయి విధ్వంసానికి దారితీశాయో అందరికీ తెలిసిందే. ఆనాడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు జరిగాయి, చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడం సహజమే, కానీ ఆ విమర్శలు స్థాయిని మించి వ్యక్తిగత దూషణలకు దిగినప్పుడు అవి ఇలాంటి హింసాత్మక పరిణామాలకు దారితీస్తాయి.
నేడు అంబటి చేసిన వ్యాఖ్యలు కూడా అదే తరహాలో ఉండటంతో, ఇరు పార్టీల మధ్య కక్ష సాధింపు రాజకీయాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, అంబటి అరెస్టును వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వం తమ గొంతు నొక్కేస్తోందని, నిరసన తెలిపే హక్కు తమకు లేదా అని ప్రశ్నిస్తోంది. అయితే, తాము అధికారంలో ఉన్నప్పుడు పట్టాభి వ్యాఖ్యలను సాకుగా చూపి దాడులు చేసిన విషయాన్ని ఇప్పుడు విపక్ష నేతలు మర్చిపోవడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న ఈ ధోరణి ఆందోళన కలిగిస్తోంది. విధానపరమైన విమర్శలు పక్కన పెట్టి, నోటి దూలతో వ్యక్తిగత దాడులకు దిగడం వల్ల అంతిమంగా నష్టపోయేది రాష్ట్ర ప్రతిష్టే. అంబటి వ్యాఖ్యలు ఒక రకంగా వైసీపీని మరింత డిఫెన్స్‌లో పడేశాయని చెప్పవచ్చు.






