ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీసుకుంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. అయన వయస్సు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంత కాలంగా ఆయన వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం కావడంతో.. ‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన వద్దు’ అంటూ ప్రకటన చేసిన మూడురోజులకే ఆయన కన్నుమూశారు.
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు ముని మనవడైన రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. రతన్ టాటా చనిపోయారంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘గడియారం టిక్ చేయడం ఆగిపోయింది. టైటాన్ చనిపోయిది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారు, ఆయన వ్యాపార, వెలుపలి ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ ఎదుగుతాడు. ఆర్.ఐ.పి’ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.