India: వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు : జైమీసన్ గ్రీర్

భారత్‌తో వాణిజ్య ఒప్పందం అమెరికా ఉత్పత్తులకు కొత్త అవకాశాలను తీసుకొస్తుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి ( యూఎస్‌టీఆర్) జైమీసన్ గ్రీర్ (Jamieson Greer) తెలిపారు. అంతేకాదు ఇరు దేశాల్లోని కార్మికులు, రైతులు, వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్-అమెరికా కాంపాక్ట్ భాగస్వామ్యం ప్రాధాన్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(J.D. Vance) , భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటన మరోసారి ధ్రువీకరించినట్టు చెప్పారు. రెండు దేవాల మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతిని ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్యం విషయంలో సమతుల్యతను తీసుకొస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యూఎస్‌టీర్, భారత వాణిజ్య శాఖ, పరిశ్రమల శాఖలు చర్చలకు సంధించి నిబంధనలు ఇప్పటికే ఖరారు చేసినట్లు చెప్పారు. భారత మార్కెట్‌లో తన ఉత్పత్తులకు మరింత ప్రవేశం కల్పించడం కోసం అమెరికా చూస్తోందని, టారిఫ్(Tariff), నాన్ టారిఫ్ (non-tariff) అడ్డంకులను తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా అదనపు హామీలపై చర్చించనున్నట్టు చెప్పారు. భారత్ పెద్ద ఎత్తున టారిఫ్‌లు విధిస్తోందంటూ అమెరికా ఇప్పటికే ఎన్నో సందర్భారాల్లో ఆరోపించడం గమనార్హం.