Operation Sindoor: ఐదు పాక్ ఫైటర్ జెట్లను కూల్చాం.. వెల్లడించిన వాయుసేన చీఫ్
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఐదు పాకిస్థాన్ యుద్ధ విమానాలను కూల్చివేశామని భారత వైమానిక దళం (Indian Air Force – IAF) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) వెల్లడించారు. సుమారు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఒక నిఘా విమానాన్ని కూడా ధ్వంసం చేశామని, ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాన్ని చేధించడంలో ఇది ఒక రికార్డు అని ఆయన తెలిపారు. బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్.ఎం. కాత్రే (LM Katre) స్మారక ఉపన్యాసంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. భారత్-పాక్ ఘర్షణల సమయంలో ఐఏఎఫ్ (IAF) అద్భుతంగా పనిచేసిందని ఆయన ప్రశంసించారు. ఇటీవల రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 రక్షణ వ్యవస్థ గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని, అది అద్భుతమైన పనితీరు కనబరిచిందని కొనియాడారు. పాకిస్థాన్ వద్ద లాంగ్ రేంజ్ గైడెడ్ మిసైల్స్ ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోలేకపోయారని, వారు భారత్‌లోకి చొచ్చుకురాలేకపోయారని అన్నారు. పాకిస్థాన్‌లోని (Pakistan) వైమానిక స్థావరాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని, జాకోబాబాద్ (Jacababad) వైమానిక స్థావరంలో ఉంచిన ఎఫ్-16 జెట్లు (F-16 jets) కూడా డ్యామేజ్ అయ్యాయని ఆయన (Amar Preet Singh) వెల్లడించారు.







