Bihar Elections: బిహార్ మేనిఫెస్టో విడుదల చేసిన ఇండియా కూటమి!
సీట్ల సర్దుబాటులో జాప్యం జరిగినప్పటికీ, ‘ఇండియా’ కూటమి బిహార్ ప్రచారంలో (Bihar Elections) దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్డీఏ కంటే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన ఈ కూటమి, తాజాగా ‘బిహార్కా తేజస్వీ ప్రాణ్’ పేరిట తమ మేనిఫెస్టోను (Manifesto) విడుదల చేసింది. పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో ప్రధానంగా ఉపాధి, మహిళా సాధికారతపై దృష్టి సారించారు. ఆర్జేడీ నాయకుడు, సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, వీఐపీ చీఫ్ ముఖేశ్ సాహ్ని, కాంగ్రెస్ నుంచి పవన్ ఖేరా, సీపీఐ ఎంఎల్ నుంచి దీపాంకర్ భట్టాచార్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం గమనార్హం.
కీలక హామీలివే..
ఈ మేనిఫెస్టోలో (Manifesto) ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇండియా కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే దీని అమలుకు చట్టం చేస్తామని ప్రకటించింది. అలాగే జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగి హోదా, నెలకు రూ. 30,000 వేతనం, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి హామీలు ఈ మేనిఫెస్టోలో (Manifesto) ఉన్నాయి. మహిళల కోసం ‘మై-బెహిన్ మాన్ యోజన’ కింద నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం ప్రకటించగా, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించడం, పోటీ పరీక్షలకు అప్లికేషన్ ఫీజు రద్దు వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.







