INDIA: జులై 19న ఇండియా కూటమి సమావేశం.. ఖర్గే ఇంట్లో కలవనున్న కీలక నేతలు

ఈ నెల 19న ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి నాయకుల కీలక సమావేశం జరగనుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీని నిర్వహించనున్నారు. దీని గురించి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో సహా పలువురు నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. ఈ సమావేశంలో వర్షాకాల సమావేశాలు, బిహార్‌లోని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ వంటి కీలక అంశాలపై ఇండియా (INDIA) కూటమి నేతలు చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ భేటీకి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు హాజరుకావడం లేదని తెలుస్తోంది. టీఎంసీ (TMC) జూలై 21న షహీద్ దివస్ జరుపుకుంటుండటంతో ఆ పార్టీ నాయకులు బిజీగా ఉన్నారని, అలాగే ఆప్ (AAP) కూడా పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఇండియా (INDIA) కూటమి సమావేశం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.