Justice Gavai: ‘నేను హిందూ వ్యతిరేకిని కాదు’.. ఆరోపణలను ఖండించిన మాజీ సీజేఐ గవాయ్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice Gavai) తనపై వస్తున్న ‘హిందూ వ్యతిరేకి’ అనే ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇటీవల ఒక మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. తనపై జరిగిన షూ దాడి తన విధులను ఏ మాత్రం ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. సీజేఐగా తన పదవీకాలంలో కేవలం చట్ట పాలన, లౌకికవాద సూత్రాలను కాపాడటంపైనే దృష్టి సారించానని తెలిపారు. “నాకు స్పష్టమైన మనస్సాక్షి ఉంది, నేను అన్ని మతాలను గౌరవిస్తాను. నా తండ్రి లౌకికవాది, ఆ లక్షణాలను ఆయన నుంచే నేర్చుకున్నాను,” అని జస్టిస్ గవాయ్ (Justice Gavai) వివరించారు. తనపై షూ విసిరిన వ్యక్తిని క్షమించడానికి కారణం కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలేనని చెబుతూ, “చట్టం గొప్పతనం ఒకరిని శిక్షించడంలో కాదు, క్షమించడంలో ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.
భారత న్యాయస్థానాలు స్వతంత్రంగా, బలంగా ఉన్నాయని, అవి ఎవరి ఒత్తిడితోనూ పనిచేయవని ఈ సందర్భంగా ఆయన (Justice Gavai) తేల్చి చెప్పారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక ఒత్తిడిలో పనిచేస్తుందనే ఆరోపణలకు ఆధారం లేదన్నారు. అంతేకాకుండా పదవీ విరమణకు రెండు రోజుల ముందు, న్యాయ స్వతంత్రతకు విరుద్ధంగా ఉన్న కొన్ని ట్రిబ్యునల్ సేవా నిబంధనలను తాను రద్దు చేశానని గుర్తు చేశారు. నవంబర్ 23న పదవీ విరమణ చేసిన జస్టిస్ గవాయ్ (Justice Gavai).. రిటైర్మెంట్ తర్వాత ఏ ప్రభుత్వ పదవినీ అంగీకరించబోనని స్పష్టం చేశారు.






