Health Insurance: ఆరోగ్య బీమా వర్సెస్ అత్యవసర నిధి: ఆర్థిక భద్రతకు ఏది అవసరం?
మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ప్రతి కుటుంబానికీ పక్కా ఆర్థిక ప్రణాళిక ఉండటం ఎంతో అవసరం. అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యం ముంచుకొస్తే ఆసుపత్రి బిల్లులు ఎంతవుతాయో ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు. ఒక్కోసారి లక్షల్లో ఖర్చు కావచ్చు. ఆ సమయంలో చేతిలో సరిపడా నగదు లేకపోతే అప్పుల పాలు కావాల్సి వస్తుంది. ఇలాంటి ఊహించని ఆర్థిక విపత్తుల నుంచి కాపాడేందుకు ‘ఆరోగ్య బీమా (Health Insurance)’, ‘అత్యవసర నిధి (Emergency Fund)’ రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే బీమా ఉంటే సరిపోతుందా? అత్యవసర నిధి ఎందుకు? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు, ప్రయోజనాలను తెలుసుకుందాం.
ప్రధాన రక్షణ కవచం.. ఆరోగ్య బీమా
ఆరోగ్య బీమా (Health Insurance) అనేది ఏ కుటుంబానికైనా తొలి రక్షణ మార్గం. ఆసుపత్రిలో చేరడం, సర్జరీలు, డే-కేర్ చికిత్సలు, అంబులెన్స్ ఛార్జీలతో పాటు ఆసుపత్రిలో చేరడానికి ముందు, డిశ్చార్జి అయిన తర్వాత అయ్యే ఖర్చులను కూడా ఇది కవర్ చేస్తుంది. మీరు తీసుకున్న పాలసీని బట్టి 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో అయ్యే భారీ వైద్య బిల్లులను బీమా కంపెనీలే భరిస్తాయి. దీనికి తోడు మీరు చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద ప్రతి ఏటా పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు.
అత్యవసర నిధితో అదనపు భరోసా
ఆరోగ్య బీమా (Health Insurance) ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ కనీసం 3 నుంచి 6 నెలల జీవన వ్యయాలకు సరిపడా ‘అత్యవసర నిధి‘ని (Emergency Fund) ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే అన్ని రకాల చికిత్సలు, మందుల ఖర్చులు బీమా పరిధిలోకి రాకపోవచ్చు. అలాగే మీరు నెట్వర్క్ లేని ఆసుపత్రిలో (నాన్-నెట్వర్క్ హాస్పిటల్) చికిత్స తీసుకుంటే, మొదట బిల్లు మొత్తం మీ జేబు నుంచే చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. బీమా (Health Insurance) పత్రాల పరిశీలన, క్లెయిమ్ సెటిల్మెంట్కు కొంత సమయం పడుతుంది. అలాంటి క్లిష్ట సమయాల్లో అదనపు ఖర్చులను, బీమా కవర్ చేయని వైద్య పరీక్షలను ఎదుర్కోవడానికి ఈ అత్యవసర నిధి ఎంతో ఉపయోగపడుతుంది.

చిన్న ఖర్చులకైతే నిధే మేలు
చాలామంది ఆరోగ్య బీమా (Health Insurance) ఉంది కదా అని ప్రతి చిన్న జ్వరానికి, స్వల్ప అనారోగ్యాలకు క్లెయిమ్ చేస్తుంటారు. ఇది ఏమాత్రం సరైన విధానం కాదు. ఇలా చేయడం వల్ల పాలసీ రెన్యువల్ సమయంలో వచ్చే ‘నో క్లెయిమ్ బోనస్’ లేదా అదనపు కవరేజ్ (రెస్టోరేషన్) ప్రయోజనాలను కోల్పోతారు. పైగా ప్రీమియం కూడా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి చిన్న చిన్న ఓపీడీ ఖర్చులకు బీమా వాడకుండా మీ అత్యవసర నిధిని ఉపయోగించడం తెలివైన పని.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కేవలం నిధిపైనే ఆధారపడితే ముప్పు తప్పదు!
అలాగని ఆరోగ్య బీమా (Health Insurance) తీసుకోకుండా కేవలం బ్యాంకులో ఉన్న అత్యవసర నిధి పైనే ఆధారపడటం చాలా ప్రమాదకరం. పెద్ద జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేరితే లక్షల రూపాయల ఫండ్ క్షణాల్లో ఆవిరైపోతుంది. ఆ తర్వాత ఆ నిధిని మళ్లీ కూడబెట్టడం సామాన్యులకు చాలా కష్టం. ముఖ్యంగా వృద్ధాప్యంలో (సీనియర్ సిటిజన్లు) తరచుగా ఆసుపత్రుల పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, వారికి బీమా కచ్చితంగా ఉండాలి. ద్రవ్యోల్బణం కారణంగా వైద్య ఖర్చులు ఏటేటా పెరుగుతున్నందున, నేడు మీరు దాచుకున్న నిధి భవిష్యత్తులో సరిపోకపోవచ్చు. పైగా ఆ డబ్బు బ్యాంకులో అందుబాటులో ఉంటే ఇతర అవసరాలకు వాడేసి ఖాళీ చేసే ప్రమాదం కూడా ఉంది.
ఆరోగ్య బీమా (Health Insurance), అత్యవసర నిధి (Emergency Fund) రెండింట్లో దేని ప్రాధాన్యత దానిదే. భారీ వైద్య ఖర్చుల నుంచి బీమా మిమ్మల్ని కాపాడితే.. బీమా పరిధిలో లేని చిన్న స్థాయి చికిత్సలు, రోజువారీ ఖర్చులకు అత్యవసర నిధి భరోసానిస్తుంది. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ద్వారా ఊహించని ఆరోగ్య సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చు. భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి

















