UIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్స్

ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్స్‌కు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. ఇకపై 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలందరికీ బయోమెట్రిక్ అప్‌డేట్‌ల కోసం విధించే చార్జీలను పూర్తిగా తొలగించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. ఈ తాజా నిబంధన అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మినహాయింపును ఏడాదిపాటు అమలు చేయనున్నట్లు యూఐడీఏఐ (UIDAI) ప్రకటించింది. ఐదేళ్లలోపు పిల్లల వేలిముద్రలు, ఐరిస్ పూర్తిగా అభివృద్ధి చెందదు. అందుకే వారికి ఆధార్ కార్డు (Aadhar) నమోదు చేసే సమయంలో వారి బయోమెట్రిక్‌ను నమోదు చేయరు. అందుకే 5-7 ఏళ్ల మధ్య పిల్లల బయోమెట్రిక్ వివరాలను తొలిసారిగా తప్పనిసరిగా అప్‌డేట్ చేస్తారు. దీనిని మొదటి మాండటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) అంటారు. ఆ తర్వాత 15-17 ఏళ్ల వయసులో రెండోసారి తప్పనిసరి అప్‌డేట్ (MBU) చేసుకోవాలి. యూఐడీఏఐ (UIDAI) తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈ ఏడాదిపాటు 5-17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఈ రెండు ఎంబీయూ (MBU)లను ఉచితంగా చేయనున్నారు.