USAID: ఓటింగ్ శాతం పెంపునకు ..యూఎస్‌ఎయిడ్ నిధులివ్వలేదు

భారత్‌లో 2014-2024 మధ్య ఓటింగ్ శాతాన్ని పెంచడానికి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ( యూఎస్‌ఎయిడ్) 21 మిలియన్ల డాలర్లు వ్యయం చేసినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఓటింగ్ శాతం పెంచే దిశగా ఆ సంస్థ కార్యక్రమాలు చేపట్టడం కూడా నిజం కాదని తెలిపింది. అమెరికా ఎంబసీ తమకు సమర్పించిన వివరాలతో ఈ విషయం నిర్ధారణ అయినట్లు పేర్కొంది. సీపీఐ ఎంపీ జాన్ బ్రిట్టాస్ (John Brittas) రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ (Kirti Vardhan Singh )ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సెప్టెంబరు 2 కల్లా భారత్‌లో యూఎస్‌ఎయిడ్ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఆపేస్తున్నట్లు యూఎస్ ఎంబసీ (US Embassy) తమకు తెలిపినట్లు కీర్తి వర్ధన్ పేర్కొన్నారు. భారత్‌లో ఓటింగ్ శాతం పెంచడం కోసం యూఎస్‌ఎయిడ్ చేపట్టిన ప్రాజెక్టుకు 21 మిలియన్ల డాలర్లు అందినట్లు గతంలో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) పేర్కొనడం చర్చనీయాంశమైంది.