One Nation One Election: జమిల్లి ఎన్నికలు రాజ్యాంగ బద్ధమేనన్న మాజీ సీజేఐలు!

వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation One Election) ప్రతిపాదనపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్‌లు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తమ ప్రజెంటేషన్‌ను సమర్పించారు.
మాజీ సీజేఐల అభిప్రాయాలు
ఈ విధానం (One Nation One Election) రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పటికీ, కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని మాజీ సీజేఐలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం కాదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం ప్రాథమిక నిర్మాణం (బేసిక్ స్ట్రక్చర్)లో భాగమే అయినప్పటికీ, ఎన్నికలను విడివిడిగా నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. అయితే కేంద్రం ప్రతిపాదించిన (One Nation One Election) బిల్లు ద్వారా భారత ఎన్నికల సంఘానికి (ECI) ఇవ్వబడిన అపరిమిత అధికారాలపై జస్టిస్ చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమచారం. ముఖ్యంగా ఎన్నికైన అసెంబ్లీల పదవీ కాలాన్ని తగ్గించడానికి ఎన్నికల సంఘానికి అధికారం ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. గతంలో మాజీ సీజేఐలు యూయూ లలిత్, రంజన్ గొగోయ్‌లు కూడా జేపీసీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
జేపీసీ చైర్‌పర్సన్ వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ (One Nation One Election) విధానానికి అనుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని జేపీసీ చైర్‌పర్సన్ పీపీ చౌదరి (JPC Chairperson PP Chaudhary) తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైన సవరణలు చేసిన తర్వాతే నివేదికను పార్లమెంటుకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ (One Nation One Election) అత్యవసరమని నొక్కి చెప్పిన చౌదరి.. ఈ వ్యవస్థ ఎక్కువ కాలం కొనసాగాలంటే బిల్లు యొక్క రాజ్యాంగబద్ధత చెక్కుచెదరకుండా ఉండటం చాలా ముఖ్యమని అన్నారు.