Panneerselvam : తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం .. ఎన్డీయేకు పన్నీర్ సెల్వం గుడ్‌బై
తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలగారు. ఈ మేరకు మాజీ మంత్రి, సెల్వంకు నమ్మినబంటు రామచంద్రన్ ప్రకటించారు. ఆయన ప్రకటిస్తున్న సమయంలో సెల్వం కూడా అక్కడే ఉన్నారు. మార్నింగ్ వాక్ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను పన్నీర్ సెల్వం కలిశారు. పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎన్డీయే కూటమితో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పన్నీర్ సెల్వం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. పొత్తుల గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన సమయం కాదని, ఎన్నికల ముంగిట ఆ అంశం గురించి మాట్లాడతామని అన్నారు.






