Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల
జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhad ) రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి (Vice President) స్థానం భర్తీకి ముహూర్తం ఖరారైంది. 17వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల ఏడో తేదీన నోటిఫికేషన్ (Notification) జారీ అవుతుందని, అదే రోజు నామినేషన్ల దాఖలు మొదలవుతుందని, 21వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంటుందని వెల్లడించింది. 22న నామినేషన్లు పరిశీలిస్తారు. పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు ఆఖరి గడువు 25వ తేదీ. అనివార్యమైతే వచ్చే నెల 9వ తేదీన పోలింగ్ (Polling) జరుగుతుందని ఈసీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 9న పార్లమెంటు భవనం మొదటి అంతస్తులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు.






