Pawan Kalyan: భాషా విధానంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై స్పందించిన డీఎంకే ..

జనసేన (Janasena) అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే (DMK) పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్‌కి తమిళ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఏం తెలుసని వారు ప్రశ్నించారు. తమిళనాడు రాజకీయాల గురించి అర్థం చేసుకోకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. తాజాగా చెన్నైలో మీడియాతో మాట్లాడిన డీఎంకే సీనియర్ నాయకులు హఫీజ్ ఉల్లా( Hafeezullah), ఎళన్‌గోవన్‌లు పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను తప్పుబట్టారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడిన విషయాలు తప్పుడు సమాచారం కలిగినవని, నిజాలను అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ముఖ్యంగా భాషా విధానంపై ఆయన వ్యాఖ్యలు వారికి అభ్యంతరకరంగా అనిపించాయి.
పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎళన్‌గోవన్ మాట్లాడుతూ, ఆయన మోదీ ప్రభావంలో ఉన్నారని, అందుకే స్పష్టమైన సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తమిళనాడులో త్రిభాషా విధానం (తమిళం, ఇంగ్లీష్, హిందీ) లేదని స్పష్టంగా తెలిపారు. తమిళులు హిందీకి వ్యతిరేకంగా చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని, ఇది 1938లోనే ప్రారంభమైందని గుర్తుచేశారు. అంతేకాకుండా, 1968లో అసెంబ్లీలో ద్విభాషా విధానాన్ని అనుసరించాలని తీర్మానం చేయడం జరిగిందని వివరించారు. ఈ చరిత్ర తెలియక పవన్ కళ్యాణ్ మాట్లాడడం తగదని విమర్శించారు.
ఇక హఫీజ్ ఉల్లా పవన్ కళ్యాణ్‌పై మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ పూర్తిగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నారని, అయితే తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడే ముందు నిజాలు అర్థం చేసుకోవడం అవసరమని సూచించారు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదని, రాజకీయ పరిణామాలు ఎదుర్కొనే సాహసం ఉంటేనే తమిళనాడు గురించి మాట్లాడాలని హితవు పలికారు.
తమిళుల భావాలను అవమానించేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఆరోపించారు. హిందీ భాషకు వ్యతిరేకత వ్యక్తిగతంగా కాకుండా, ఒక భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ బీజేపీని సమర్థించవచ్చని, కానీ ఆ పార్టీ ఆచరణ ఎలా ఉంటుందో భవిష్యత్తులో అర్థమవుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్టాలిన్‌పై చేసిన విమర్శలను కూడా వారు తప్పుబట్టారు. స్టాలిన్ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న నాయకుడని, ఆయనను విమర్శించే ముందు ఆ అంశాలను గమనించాలని సూచించారు. రాజకీయాల్లో ఎవరి విధానం వారిది, కానీ పరిమితులను దాటితే ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించారు. తమిళుల అభిప్రాయాలను అర్థం చేసుకోకుండా మాట్లాడితే, భవిష్యత్తులో ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుందని అన్నారు. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.