Amit Shah: “వికసిత్ కేరళ” మా లక్ష్యం.. పీఎఫ్‌ఐ అవినీతిపై అమిత్ షా విమర్శలు!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కేరళలోని అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం తిరువనంతపురంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ‘మరార్జీ భవన్’ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. “రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి లేకపోయినా, వికసిత్ కేరళే బీజేపీ లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తూ.. గతంలో వరుసగా అధికారంలోకి వచ్చిన యూడీఎఫ్ (UDF), ఎల్‌డీఎఫ్ (LDF) ప్రభుత్వాలు అవినీతిలో మాత్రమే పాలుపంచుకున్నాయని విమర్శించారు. అంతేకాకుండా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) వంటి దేశ వ్యతిరేక శక్తులకు కేరళను స్వర్గధామంగా మార్చాయని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి లేకుండా వికసిత్ భారత్ (Vikasit Bharat) సాధ్యం కాదని ఆయన నొక్కి చెప్పారు. వికసిత్ భారత్‌కు మార్గం ‘వికసిత్ కేరళ’ (Vikasit Kerala) ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు. అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తుంటే, సీపీఎం (CPM) మాత్రం తమ పార్టీ వ్యక్తుల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఎన్డీఏ (NDA) పోటీ చేస్తుందని అమిత్ షా ప్రకటించారు. ఎన్డీఏ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురాగలదని, ఎల్డీఎఫ్‌కు, అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఇది సాధ్యం కాదని ఆయన పునరుద్ఘాటించారు.