Supreme Court : సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ప్రభుత్వం ..ఆ నిషేధాన్ని ఎత్తివేయండి

పదేళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (National Green Tribunal) ఇచ్చిన ఆదేశాలను 2018 అక్టోబర్ 29న సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 28న విచారణ జరిగే అవకాశం ఉన్నది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai) నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనున్నది. వాహనాల వయసు ఆధారంగా మాత్రమే తొలగించడం కాలుష్యాన్ని నియంత్రించడానికి శాస్త్రీయ మార్గం కాదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంటున్నది. ఫిట్‌నెస్ (Fitness) ఆధారం వాహనం వయసు కాదని, వాస్తవ కాలుష్య స్థాయి అని పిటిషన్‌లో పేర్కొంది. శాస్త్రీయ దర్యాప్తు, ప్రమాణాలు అవసరమని తెలిపింది. వయసు ఆధారిత నిషేధం మరింత ప్రభావవంతంగా ఉందా లేదా? కాలుష్య స్థాయి ఆధారిత విధానమా? అని నిర్ధారించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ వివరణాత్మక అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.