National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు!

నేషనల్ హెరాల్డ్ (National Herald Case) మనీలాండరింగ్ కేసులో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాఖలు చేసిన ఛార్జిషీటుపై సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తన తీర్పును రిజర్వ్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ జడ్జ్ (పీసీ యాక్ట్) విశాల్ గోగ్నే ఈడీ ఆరోపణలను మరింత చట్టపరమైన విచారణకు స్వీకరించాలా? లేదా? అనే అంశంపై జులై 29న తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ తీర్పు కేసు భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. ఈ కేసులో కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నేషనల్ హెరాల్డ్ (National Herald Case) పత్రికకు రూ.90 కోట్లు అప్పుగా ఇచ్చి, ఏకంగా రూ.2 వేల కోట్ల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం జరిగిందని ఈడీ వెల్లడించిన విషయం తెలిసిందే.