CM Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి చేసిన యువకుడు.. సీఎం తలకు గాయం!

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై (CM Rekha Gupta) ఆమె నివాసంలోనే దాడి జరిగింది. ‘జన్ సున్‌వాయీ’ కార్యక్రమంలో ప్రజల సమస్యలు వింటుండగా, ఒక వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమెను చెంపదెబ్బ కొట్టి, జుట్టు పట్టుకొని లాగినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆమెపై దాడి జరిగిన మాట నిజమే కానీ చెంపదెబ్బ కొట్టలేదని బీజేపీ (BJP) వర్గాలు అంటున్నాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 41 ఏళ్ల రాజేష్ భాయ్ ఖింజీ భాయ్‌గా గుర్తించారు. తన బంధువును జైలు నుంచి విడిపించాలని కోరేందుకు రాజేష్ సీఎం (CM Rekha Gupta) వద్దకు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజేష్ తల్లిని విచారించగా, తన కొడుకు జంతు ప్రేమికుడని, ఇటీవల వీధికుక్కలకు (Stray Dogs) సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే అతను ఢిల్లీ వెళ్లాడని తెలిపింది. తన కొడుకు మానసికంగా సరిగా లేడని కూడా ఆమె చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.