CPI Ramakrishna: మోహన్ భాగవత్ మాటలకు సీపీఐ రామకృష్ణ మద్దతు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) జులై 9న నాగ్‌పూర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 75 ఏళ్లు దాటిన నాయకులు రాజకీయాల నుంచి తప్పుకొని యువ నేతలకు అవకాశం కల్పించాలని భాగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. దివంగత ఆరెస్సెస్ నాయకుడు మోరోపంత్ పింగళే గురించి ప్రస్తావిస్తూ.. 75 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసి ఇతరులకు అవకాశం ఇవ్వాలని భాగవత్ సూచించారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని (Narendra Modi) ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నాయకుడు రామకృష్ణ (CPI Ramakrishna) ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. “నేను మోహన్‌భాగవత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నాను. 75 ఏళ్లకు రాజకీయాల్లో రిటైర్డ్ కావాలి. ప్రధాని మోడీ కూడా 75 ఏళ్లకు రిటైర్‌మెంట్ తీసుకుంటే.. దేశానికి మేలు చేసినవారు అవుతారు” అని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.