Shashi Tharoor: ఈ బిల్లులో తప్పేంటి? కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా శశిథరూర్!

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) మరోసారి పార్టీ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించారన్న చర్చ నడుస్తోంది. కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే నేరాల్లో, ప్రధానమంత్రి నుండి మంత్రుల వరకు ఎవరైనా 30 రోజులకు పైగా జైలులో ఉంటే వారి పదవిని తొలగించేందుకు ఉద్దేశించిన మూడు కొత్త బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లులను కాంగ్రెస్ (Congress) వ్యతిరేకిస్తుండగా, థరూర్ మాత్రం వాటికి మద్దతుగా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ’30 రోజులు జైల్లో ఉంటే మంత్రి పదవిలో ఎలా కొనసాగుతారు? ఇది సహజంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ బిల్లులో నాకు ఎలాంటి లోపం కనిపించలేదు’ అని థరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. దీనితో ఆయన మరోసారి కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారంటే సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వివరణ ఇచ్చి థరూర్.. ‘విపక్షాలు ఒక అభిప్రాయానికి రాకముందే నేను మీడియాతో మాట్లాడాను. జైలుకెళ్లిన వారు పదవులు తొలగించడమనే ఆలోచన బాగుందని మాత్రమే నేను చెప్పాను. బిల్లును నేను పూర్తిగా సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. మొత్తం చదివిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. మీడియా నా వ్యాఖ్యలను వక్రీకరించింది’ అని వివరించారు.